కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నారా..? ఈ తప్పులు చేసారంటే..అంటే..?
కాంటాక్ట్ లెన్స్ ధరించిన వారు ఏడాదికి ఒకట్రెండు సార్లు ఆప్టోమెట్రిస్ట్ ద్వారా క్రమం తప్పకుండా కంటి పరీక్ష చేయించుకోవాలి. వైద్యులు చెప్పే సూచనలను తూచా తప్పక పాటించాలి. ఇలా కళ్లను పరీక్షించుకోవడం ఆరోగ్యకరమైన పద్ధతని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా వైద్యపరీక్ష చేయించుకోవడం ద్వారా లెన్స్‌తో వస్తున్న సమస్యలను గుర్తించి నివారించేందుకు సాయపడుతుంది. అయితే సర్వేంద్రియాల్లో అత్యంత సున్నితమైనవి కళ్లు. జీవితానికి వెలుగునిచ్చేవి కూడా అవే.
కంటికి ఏ అతి చిన్న గాయమైనా సరే అది ప్రమాదకరం కావచ్చు. అందుకే కళ్లను ఎప్పుడూ జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే కంటిరెప్పలా కాపాడాలనే సామెత కూడా ఉంది. అయితే ప్రస్తుతం కొంతమంది ఫ్యాషన్ పేరుతోనో లేదా దృష్టిలోపంతోనే కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నారు. కాంటాక్ట్ లెన్స్ వల్ల కంటికి తీవ్రమైన సమస్యలు రావచ్చనే విషయం చాలామందికి తెలియదు. కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవడం లేదా తీసేయడం చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా..కంటికి హాని కలగవచ్చు.
అంతేకాదు..ఎక్కువ సమయం కాంటాక్ట్ లెన్స్ ధరించినా సమస్యే అంటున్నారు కంటి వైద్య నిపుణులు. ఉదయం నుంచి రాత్రి వరకూ కంటిన్యూగా కాంటాక్ట్ లెన్స్ ధరించి ఉండేవారికి కంటి సంబంధిత సమస్యలు వస్తున్నాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఎక్కువ సమయం కాంటాక్ట్ లెన్స్ ధరించడం వల్ల మీ కళ్లు మండటం, కళ్లు నొప్పి పెట్టడం వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు. మరోవైపు కార్నియా సంబంధిత సమస్యలు కూడా రావచ్చు.
మీ కళ్లలో కాంటాక్ట్ లెన్స్ ధరించిన తరువాత కళ్లు ఎర్రబడుతున్నాయంటే..మీ కళ్లకు ప్రమాదం పొంచి ఉందని అర్ధం చేసుకోవాలి. ఈ సమస్య వెంటనే దూరం కాకపోతే..వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఎక్కువ సమయం కాంటాక్ట్ లెన్స్ ధరిస్తుంటే..కళ్లలో మొటిమలు వంటివి రావచ్చు. కార్నియాపై తెల్లగా లేదా గోధుమ రంగులో మచ్చల్లా కన్పిస్తాయి. ఇది చాలా ప్రమాదకరం. దీనివల్ల కళ్లు తెర్చినప్పుడు, మూసినప్పుడు ఇబ్బంది ఎదురౌతుంది. అందుకే కాంటాక్ట్ లెన్స్ సాధ్యమైనంత తక్కువగా వినియోగించడం మంచిది.