భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగుతున్నారా..? మీకు ఈ సమస్యలు తప్పవు.
మన దినచర్యలో కొన్ని అంశాలు చిన్నతనం నుంచి అలాగే కొనసాగుతూ వస్తాయి. అవి తప్పు అని మనకు తెలియకుండానే వాటిని చేసేస్తుంటాం. ఒకవేళ తప్పు అని తెలిసినా చిన్నతనం నుంచి అలవాటైన పని కాబట్టి అలాగే కొనసాగిస్తూ ఉండిపోతాం. నీళ్లు ఎక్కువగా తాగాలి అని పెద్దలు చెబుతారు కదా అని మనం భోజనం చేసేటప్పుడు కూడా నీళ్లు తాగుతూనే ఉంటాం.
అయితే మనం తినే ఆహారం జీర్ణాశయంలోకి వెళ్తుంది. జీర్ణాశయంలో ఆ ఆహారం జీర్ణమయ్యేందుకు అవసరమయ్యే ఎంజైమ్స్ విడుదలవుతాయి. ఒకవేళ భోజనం సమయంలో నీరు ఎక్కువగా తాగినట్లయితే ఆ ఎంజైమ్స్ పలుచబడిపోతాయి. అప్పుడు జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కడుపు ఉబ్బడం, బరువు పెరగడం వంటి సమస్యలు రావొచ్చు.
భోజనానికి రెండు గంటల ముందు, భోజనానికి అరగంట తర్వాత నీళ్లు తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. భోజన సమయంలో కొద్ది కొద్దిగా నీటిని సిప్ చేయొచ్చు గానీ గ్లాసులకు గ్లాసులు తాగవద్దని సూచిస్తున్నారు. అలాగే, భోజనం సమయంలో గోరు వెచ్చని నీరు తాగడం మరింత మంచిదని చెబుతున్నారు. భోజనం సమయంలో నీరు తాగొద్దనేది అపోహ మాత్రమే అనేవారు లేకపోలేదు.
అయితే భోజనం సమయంలో ఎక్కువ నీరు తీసుకోకుండా కొద్ది కొద్దిగా నీటిని సిప్ చేస్తే ఏ సమస్య ఉండదంటున్నారు. కాబట్టి జీర్ణ వ్యవస్థ బాగుండాలంటే భోజనం సమయంలో అతిగా నీరు తాగొద్దు. అయితే భోజనం తర్వాత అరగంటకు సరిపడా నీళ్లు తాగాలి. తద్వారా భోజనం సరిగా జీర్ణమవుతుంది. మలబద్దకం లాంటి సమస్యలు తలెత్తవు.