వ్యాయామాం ఎక్కువగా చేస్తే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందా..?
వ్యాయామం అనేది శారీరక దృఢత్వం, ఆరోగ్యం కోసం చేసే శారీరక ప్రక్రియ. వ్యాయామం ఎక్కువగా కండరాలను, రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగు పరచడానికి, క్రీడలలో మంచి ప్రావీణ్యత సాధించడానికి, అధిక బరువు తగ్గించుకోవడానికి, మానసిక ఉల్లాసం కొరకు చేస్తారు. క్రమం తప్పకుండా చేసే వ్యాయామం వలన మన శరీరపు వ్యాధినిరోధక శక్తి పెంపొందుతుంది, గుండెకు సంబంధించిన వ్యాధులు, స్థూలకాయం, మధుమేహం వంటి వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది.
అయితే చాలా మంది రిలాక్సేషన్ కోసం జిమ్‌కు వెళతారు. కోపంగా ఉన్నప్పుడు, తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు కూడా రిలాక్స్ అయ్యేందుకు, మూడ్ మార్చుకునేందుకు జిమ్‌కు వెళతారు. కానీ అలా వెళ్లడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం పెరుగుతుందని చెబుతున్నారు వైద్యులు. పరుగు, వ్యాయామం గుండెకు మేలు చేస్తాయన్నది నిజమే. ఎందుకంటే ఇవి హృదయ స్పందన రేటును పెరగకుండా చూస్తుంది. గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.కొందరు ఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యాయామాలు చేస్తుంటారు.
తలలోని బాధను, ఆలోచనలను క్లియర్ చేసుకునేందుకు, ప్రశాంతతను పొందేందుకు వ్యాయామాలు తీవ్రంగా చేస్తుంటారు కొంతమంది. కోపంగా ఉన్నప్పుడు, తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు రన్నింగ్, వ్యాయామాలు చేయడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం మూడు రెట్లు ఎక్కువ అని చెబుతున్నారు అంతర్జాతీయ వైద్యులు. కోపంగా ఉన్నప్పుడు అధికంగా వర్కౌట్లు చేస్తే హృదయ స్పందన రేటు పెరుగుతుంది. రక్త నాళాల నుంచి ప్రవహించే రక్తం వేగం పెరిగిపోతుంది. గుండెకు రక్త సరఫరాలో ఆటంకం కలుగుతుంది.
రక్త నాళాలు సన్నబడతాయి కూడా. అందుకే మానసిక క్షోభలో ఉన్నప్పుడు తీవ్రమైన శారీరక శ్రమకు దూరంగా ఉండాలి. గుండెపోటు లక్షణాలు.. ధమనులలో ఆటంకాలు ఏర్పడడం వల్ల గుండెకు రక్త ప్రసరణ ఆగిపోతుంది. అప్పుడు గుండెపోటు వస్తుంది. సకాలంలో చికిత్స అందకపోతే మరణం సంభవించవచ్చు. గుండెపోటు ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయంటే… ఛాతి నొప్పి, దవడ నొప్పి, శ్వాస ఆడకపోవుట, కాంతిని గుర్తించలేకపోవడం, వెన్నునొప్పి, చేతుల్లో నొప్పి, ఛాతీ బిగుతుగా అనిపించడం, ఆందోళన, అసాధారణ హృదయ స్పందన రేటు.