40 ఏళ్ల తర్వాత గర్భందాల్చటం బిడ్డకూ శ్రేయస్కరమేనా..? ఏ వయసులో గర్భం దాలిస్తే మంచిదో తెలుసా..?
సాధారణంగా 20, 22 ఏళ్ల వయసు గర్భధారణకు అనువైన వయసు. ఈ వయసులో నాణ్యమైన అండాలను కలిగి ఉంటారు. గర్భధారణ జరిగే అవకాశాలు కూడా ఈ వయసు మహిళలకే ఎక్కువగా ఉంటాయి. అమ్మాయిలు కనీసం 25 నుంచి 30, 32 ఏళ్ల లోపు తొలి బిడ్డను ప్రసవించేలా ముందుగా ప్లాన్ చేసుకోవాలి. ఈ వయసు మహిళల్లో గర్భధారణకు అధిక అవకాశాలు ఉంటాయి. వయసు 35 ఏళ్లకు చేరేసమయానికి అండాల నాణ్యత తగ్గుతుంది. ఈకారణంగా గర్భధారణ అవకాశాలు తగ్గి, ఇన్ఫెర్టిలిటీ సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యలను అధిగమించి గర్భం దాల్చే సమయానికి వయసు మరింత పెరిగిపోతుంది.
అయితే గత కొన్ని సంవత్సరాలుగా లేటు వయస్సులో వివాహాలు చేసుకునే పరిస్ధితి స్త్రీ, పురుషులలో నెలకొంది. చాలా మంది మహిళలు 40 సంవత్సరాల వయస్సులో గర్భం ధరించి బిడ్డలకు తల్లులుగా మారుతున్నారు. ఇటీవలి కాలంలో 40 ఏళ్ల వయసులో బిడ్డ పుట్టడం సర్వసాధారణంగా మారింది. చాలా మంది మహిళలు తమ 40 ఏళ్ల వయసులో పిల్లలను కనేందుకు ఇష్టపడుతున్నారు. అయితే ఆలస్యంగా గర్భం దాల్చడం ఎంతవరకు సురక్షితమైనది. దాని వల్ల ఎదురయ్యే సమస్యలు ఏమిటి అన్నదానిపై చాలా మందిని ఆందోళనకు గురిచేస్తుంది.
వయస్సుతో పాటు స్త్రీ సంతానోత్పత్తి క్షీణించడంతో గర్భం ధరించడం అన్నది సవాలుగా మారుతుంది. 35 సంవత్సరాల వయస్సు తర్వాత, స్త్రీ యొక్క అండాల పరిమాణం , నాణ్యత తగ్గుతుంది, ఇది గర్భం ధరించటాన్ని కష్టంగా మారుస్తుంది. 40 ఏళ్లు పైబడిన మహిళల్లో ప్రతి నెల అండాలు విడులయ్యే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. 40 ఏళ్ల తర్వాత గర్భం దాల్చే చాలా మంది మహిళలు ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) లేదా ఇతర సంతానోత్పత్తి చికిత్సలు వంటి వైద్యపరమైన చికిత్సలు పొందటం మంచిది. ఈ సాంకేతికత గర్భం దాల్చే అవకాశాలను పెంచుతుంది.
40 ఏళ్లు పైబడిన మహిళలు తరుచుగా ప్రినేటల్ చెక్-అప్లకు వైద్యులు సిఫార్సు చేస్తారు. ఈ పర్యవేక్షణ కారణంగా సమస్యలను సకాలంలో గుర్తించడానికి వీలుకలుగుతుంది. 40 ఏళ్లు పైబడిన స్త్రీలలో మధుమేహం, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. తల్లి, బిడ్డ ఇద్దరి శ్రేయస్సుకోసం గర్భధారణ సమయంలో జాగ్రత్తలు పాటించటం మంచిది. గర్భస్రావం ప్రమాదం: గర్భస్రావం ప్రమాదం అన్నది తల్లి వయస్సుతో పెరుగుతుంది. తల్లికడుపులో అభివృద్ధి చెందుతున్న పిండంలో క్రోమోజోమ్ అసాధారణతలకు కారణమవుతుంది. ఈ సమస్యలను గుర్తించటానికి ప్రారంభం లో జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం.
40 ఏళ్లు పైబడిన మహిళలు గర్భధారణ సమయంలో మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితి తల్లి , బిడ్డ ఇద్దరికీ క్షేమంకాదు. శిశువు తక్కువ బరువుతో జన్మించటం, సిజేరియన్ ప్రమాదాన్ని కలిగిస్తుంది. గర్భధారణ సమయంలో అధిక రక్తపోటు అన్నది 40సంవత్సరాల వయస్సులో గర్భందాల్చిన వారిలో ఎక్కువగా ఉంటుంది. రెగ్యులర్ రక్తపోటు పర్యవేక్షణ ఈ సందర్భంలో చాల అవసరం. 40 ఏళ్ళ వయస్సులో గర్భందాల్చేవారిలో ముందస్తుగా శిశువులు జన్మించే ప్రమాదం పెరుగుతుంది. నవజాత శిశువు ఆరోగ్య సమస్యలకు దారి తీసేందుకు కారణమవుతుంది.
ముందస్తు ప్రసవాన్ని నివారించడానికి తగిన జాగ్రత్తలు, వైద్యపర్యవేక్షణ అవసరమవుతుంది. సంతానోత్పత్తి చికిత్సలు చేయించుకుంటున్న మహిళలు, 40 ఏళ్లు పైబడిన వారిలో సాధారణంగా కవలలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారిలో నెలలు నిండకుండానే శిశువులు పుట్టే ప్రమాదాలు పెరుగుతాయి. ప్రస్తుతం వైద్య శాస్త్రంలో వచ్చిన అనేక మార్పులు, ప్రినేటల్ కేర్, జీవనశైలి వల్ల 40 తరువాత కూడా బిడ్డలను కలనటం పెద్ద కష్టమేమికాదు. 40 ఏళ్ల తర్వాత గర్భం దాల్చటం వల్ల ఎదురయ్యే పరిస్ధితులను ముందుగా అవగాహన కలిగి ఉండటం ద్వారా ప్రమాదాలను తగ్గించుకునేందుకు, జాగ్రత్తలు పాటించేందుకు అవకాశం ఏర్పడుతుంది.