35 ఏళ్ల దాటాక స్త్రీ గర్భం దాలిస్తే ఆరోగ్యకరమైన బిడ్డ పుడుతుందా..? వైద్యులు ఏం చెప్పారంటే..?
కొంత వయసు దాటాక స్త్రీలు బిడ్డలను కనడం ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. 35- 40 సంవత్సరాలు దాటిన మహిళలు గర్భం దాల్చినపుడు.. తల్లి, బిడ్డా ఇద్దరూ అనారోగ్య సమస్యల బారినపడే అవకాశముంది.గర్భం దాల్చబోయే ముందు, గర్భంతో ఉన్నపుడు, కాన్పు సమయంలో.. ఇలా ప్రతి దశలోనూ సమస్యలు తలెత్తుతాయి. అయితే బిడ్డల్ని కనేందుకు 35 ఏళ్ల వయసు సరైనది కాదని చెబుతున్నారు వైద్యులు. ఇలా 35 ఏళ్ల వయసులో గర్భం ధరించినా కూడా బిడ్డ ఆరోగ్యం, తల్లి ఆరోగ్యం పై చాలా ప్రభావం పడుతుందని వివరిస్తున్నారు.
35 ఏళ్ల వయసు దాటినా కూడా సాధారణ పద్ధతిలో గర్భం ధరించే అవకాశాలు ఉంటాయి, అయితే ఆ ప్రయాణం కాస్త ప్రమాదకరంగా ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. ఎందుకంటే 35 ఏళ్ల వయసు ఉన్న స్త్రీలలో అండాలు నాణ్యతగా ఉండకపోవచ్చని, గుడ్ల సంఖ్య కూడా తక్కువగానే ఉంటుందని వారు వివరిస్తున్నారు. ఆడపిల్ల పుట్టుకతోనే లక్షల కొద్దీ అండాలను కలిగి ఉంటుందని, వయసు పెరుగుతున్న కొద్దీ ఆ అండాల సంఖ్య కూడా తగ్గిపోతూ ఉంటుందని వారు చెబుతున్నారు. ఆడపిల్ల రజస్వల అయ్యే నాటికి పుట్టుకతో వచ్చిన అండాలలో కేవలం సగం మాత్రమే మిగులుతాయని వారు వివరిస్తున్నారు.
ప్రతినెలా నెలసరి సమయంలో అండాలు విడుదలై బయటికి పోతుంటాయని చెబుతున్నారు. 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య అండాలు నాణ్యతను కలిగి ఉంటాయని, ఆ సమయంలోనే గర్భం ధరించడం చాలా ముఖ్యమని వివరిస్తున్నారు. ఆడవాళ్ళలో మెనోపాజ్ ఒకప్పుడు 45 ఏళ్లకు వచ్చేది. ఇప్పుడు కొందరిలో 40 ఏళ్లకే మెనోపాజ్ వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి. 35 ఏళ్ల తర్వాత మెనోపాజ్‌కు దగ్గర అవుతున్నట్టే లెక్క. అలాంటి సమయంలో గర్భం దాల్చడం వల్ల తల్లీబిడ్డలు ఇద్దరూ ఆరోగ్యపరంగా బలహీనంగా ఉన్నట్టే లెక్క. అలాగే స్త్రీలో ఉండే అండాలు కూడా నాణ్యతగా ఉండవు. కాబట్టి పుట్టే బిడ్డ ఆరోగ్యం పై కూడా ఆ ప్రభావం పడవచ్చు.
35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం వల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం అధికంగా ఉంటుంది. అలాగే ఆ స్త్రీకి అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నట్లయితే ఆ గర్భం నిలవడం కూడా కష్టంగా మారుతుంది. తొమ్మిది నెలలు గర్భం నిలిచినా కూడా ప్రసవం మరొక సవాలుగా ఉంటుంది. ముప్ఫై అయిదేళ్లు దాటిన తర్వాత గర్భం ధరించినా ప్రతి మహిళా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముప్పై అయిదేళ్లు దాటిన తర్వాత ఎంతోమంది మహిళలు బిడ్డలను కంటున్నారు. అయితే ఆ బిడ్డలో క్రోమోజోమ్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అంటే ఆ బిడ్డ డౌన్ సిండ్రోమ్‌తో లేదా ఆటిజంతో పుట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. 365 ప్రసవాల్లో ఒక బిడ్డకు ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే లేటుగా గర్భం ధరించడం వల్ల నెలలు నిండకుండానే ప్రసవం అవడం, తల్లికి ఆరోగ్య సమస్యలు లేదా బిడ్డలో లోపాలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు వైద్యులు. వీరికి సాధారణ ప్రసవం అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని, సిజేరియన్ చేయించుకోవడమే ఉత్తమమని వివరిస్తున్నారు. సంతానోత్పత్తికి 30 ఏళ్లలోపే మహిళల వయస్సు నాణ్యమైనదిగా చెబుతున్నారు వైద్యులు.